samshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో లేజర్ షో లైటింగ్ లు.. విమానానికి తప్పిన ప్రమాదం
- సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ వచ్చిన విమానం
- లైజర్ షో లైటింగ్ కారణంగా విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ఇబ్బంది పడ్డ పైలట్
- ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు తరలించిన పోలీసులు
సౌదీ అరేబియాకు చెందిన విమానానికి శంషాబాద్ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, లేజర్ లైటింగ్ కారణంతో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ చాలా ఇబ్బంది పడ్డారు. తాను పడుతున్న ఇబ్బందిని వెంటనే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, ఎయిర్ పోర్ట్ అధికారులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీప ప్రాంతంలోని రషీద్ గూడలో శివమణి అనే యువకుడు తన పుట్టినరోజు వేడుకలను లేజర్ లైటింగులో జరుపుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి శివమణిని అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు తరలించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. వాస్తవానికి ఎయిర్ పోర్టు నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో లేజర్ షో లైటింగులపై నిషేధం ఉంది.