Sunita: ఇంత కిరాతకమా?... మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న వివేకా కుమార్తె సునీత!
- పెద్దాయన్ను అత్యంత క్రూరంగా హత్య చేశారు
- విచారణ ఫెయిర్ గా సాగాలి
- కుటుంబంలో విభేదాలుంటే హత్యలు చేసుకుంటారా?
- తన పనిని తాను చేసుకునేందుకు సిట్ కు అవకాశం ఇవ్వాలి
తన తండ్రిని అత్యంత క్రూరంగా హత్య చేశారని, దానిపై విచారణకు సిట్ టీమ్ ఏర్పాటు అయినా, దానిని పారదర్శకంగా విచారణ చేయనియ్యడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆరోపించారు. తన తండ్రికి జగన్ సీఎం కావాలన్న కోరిక ఉందని, అందుకోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. మీడియా ఎన్నో వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తోందని, ఇది ఎంతమాత్రమూ సరికాదని అన్నారు.
ఈ ఉదయం మీడియా ముందుకు వచ్చిన సునీత, కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడారు. సొంత కుటుంబీకులే పెద్దాయనను చంపారని ప్రతి బహిరంగ సభలో పెద్దవాళ్ళు చెప్పడం వారి పైశాచిక రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించిన ఆమె, తన పనిని తాను చేసుకునేందుకు సిట్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. తమ కుటుంబంలో దాదాపు 700 మందికి పైగా ఉన్నామని, ప్రతి కుటుంబంలోనూ ఏవో కొన్ని విభేదాలుంటాయని, అంతమాత్రాన హత్యలు చేసుకుంటారా? అని ప్రశ్నించారు.
తమ కుటుంబంలో పెద్దలను ఎంతో గౌరవిస్తామని చెప్పారు. తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, బెంగళూరులో ఉన్న భూమిపై వివాదం గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. సిట్ విచారిస్తున్న సమయంలో తాను విచారణపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయాలని భావించడం లేదని, ఈ విషయంలో తన అభిప్రాయం కన్నా, తేల్చాల్సిన సంగతులే ముఖ్యమని అన్నారు. హత్య సమయంలో తన తండ్రి రాసిన లేఖ ఆయన స్వయంగా రాసిందా? కాదా? అన్న విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ తేలుస్తుందని చెప్పారు. కాగా జగన్ సి.బి.ఐ. విచారణ కోరుతున్నారు కదా అనగా, విచారణ ఫెయిర్ గా జరగాలని మాత్రం తాను కోరుకుంటున్నాను అని అన్నారు.