Chandrababu: పోరాటం మీదా? మాదా?: జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్
- ప్రచారంలో దూసుకెళుతున్న నేతలు
- ప్రధాన పార్టీల మధ్య ఆరోపణల వేడి
- హోదా కోసం పోరాడుతోంది తామేనన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, ప్రధాన పార్టీల నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వేడి పెరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రచారంలో దూసుకెళుతున్నారు. నిన్న ఓ సభలో జగన్ మాట్లాడుతూ, తన పార్టీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలూ రాజీనామాలు చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చుండేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ప్రత్యేక హోదా కోసం చివరి నిమిషం వరకూ పోరాడింది తామేనని జగన్ వ్యాఖ్యానించగా, చంద్రబాబు దీనికి దీటైన కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం సభ్యులు లోక్ సభ, రాజ్యసభలో పోరాడుతున్న వేళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన సభ్యులు ఎవరూ ఢిల్లీలో కనబడలేదని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, పైగా తిరిగి ప్రభుత్వాన్ని విమర్శించడం వారికి అలవాటైపోయిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది తెలుగుదేశం పార్టీయేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని చూస్తే వైఎస్ జగన్ భయమని ఎద్దేవా చేశారు.