India: భారతీయుల కంటే పాకిస్థానీలే సంతోషంగా ఉన్నారట!
- ఐక్యరాజ్య సమితి హ్యాపీనెస్ రిపోర్ట్
- భారత్ కు 140వ స్థానం
- 67వ స్థానంలో పాకిస్థాన్
నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవాలి! వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో భారత్ కు 140వ స్థానం దక్కగా, మనకంటే పాకిస్థాన్ ఎన్నో రెట్లు మెరుగ్గా 67వ స్థానంలో నిలిచింది. తద్వారా భారతీయుల కంటే పాకిస్థాన్ ప్రజలే సంతోషంగా ఉన్నట్టు వెల్లడైంది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో భారత్ గతేడాది కంటే ఏడు స్థానాలు దిగజారింది. 2018లో భారత్ 133వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి తరఫున సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ ఈ నివేదిక రూపొందించింది.
ఆదాయం, స్వేచ్ఛ, నమ్మకం, ఆరోగ్యకర జీవన ప్రమాణాలు, సామాజిక మద్దతు, ఉదారత వంటి 6 కీలక అంశాల ప్రాతిపదికన ఈ జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సుఖమయ జీవనానికి ఆవాసంగా ఫిన్లాండ్ కు ఐక్యరాజ్యసమితి హ్యాపీనెస్ రిపోర్ట్ పట్టంకట్టింది. ఇక ఈ జాబితాలో భారత్ పొరుగుదేశాలైన చైనా 93వ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ సైతం మనకంటే మెరుగైన రీతిలో 125వ స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 19వ ర్యాంక్ దక్కించుకుంది.