Kurnool District: కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఆ రెండు స్థానాల టీడీపీ అభ్యర్థులపై ఈరోజు క్లారిటీ
- శ్రీశైలం, దర్శి టికెట్లపై కసరత్తు చేస్తున్న అధిష్ఠానం
- ఓ చోట అభ్యర్థి విముఖత...మరోచోట అసమ్మతి
- అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం కోసం చర్చలు
నామినేషన్ల పర్వం మొదలై అప్పుడే మూడు రోజులు గడిచిపోయాయి. కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఇంకా కొలిక్కిరాని స్థానాల అభ్యర్థుల విషయంలో టీడీపీ అధిష్ఠానం ఈరోజు తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. కర్నూల్లోని శ్రీశైలం, ప్రకాశంలోని దర్శి స్థానాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే.
శ్రీశైలం అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి చంద్రబాబు టికెట్టు కేటాయించారు. ఆయన పోటీకి విముఖత చూపడంతో డైలమా ఏర్పడింది. పార్టీ నాయకుల సూచన మేరకు రాజశేఖరరెడ్డి ఆ తర్వాత మనసు మార్చుకున్నప్పటికీ ఆయన్నే కొనసాగించాలా? లేక మరో అభ్యర్థిని ప్రత్యామ్నాయంగా దించాలా? అని అధిష్ఠానం యోచిస్తోంది.
అలాగే దర్శి స్థానంపైనా వివాదం నెలకొంది. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావును ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయిస్తున్నారు. కనిగిరి ఎమ్మెల్యే బాబూరావుకు దర్శి కేటాయించారు. అధిష్ఠానం నిర్ణయంపై టీడీపీ శ్రేణులు ఆందోళను నిర్వహిస్తున్నాయి. శిద్ధా సిటింగ్ స్థానాన్ని కనీసం ఆయన కొడుకు సుధీర్‌కు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఈ రెండు స్థానాలపై చర్చించి నేడు తుది నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది.