Narendra Modi: నరేంద్ర మోదీ బయోపిక్ ట్రయిలర్... కమర్షియల్ ఎంటర్ టెయినరే నంటున్న సినీ విశ్లేషకులు!
- వివేక్ ఒబెరాయ్ ప్రధానపాత్రలో బయోపిక్
- ఈ ఉదయం ట్రయిలర్ విడుదల
- ఏప్రిల్ 5న విడుదల కానున్న చిత్రం
ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా వివేక్ ఒబెరాయ్ ప్రధానపాత్రలో ఒమాంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ... స్టోరీ ఆఫ్ ఏ బిలియన్ పీపుల్' ట్రయిలర్ విడుదలైంది. వచ్చేనెల 5న సినిమా విడుదల కానుండగా, ఈ ట్రయిలర్ ను చూసిన వారు ఇది కమర్షియల్ ఎంటర్ టెయినర్ మాదిరిగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నరేంద్ర మోదీ బాల్యం, రైళ్లలో టీ అమ్మిన దృశ్యాలు, ఆర్ఎస్ఎస్ లో చేరడం, గోద్రా అల్లర్లు, మోదీని ఇందిరాగాంధీ అరెస్ట్ చేయించడం, ఆపై ఆయనపై ప్రజల్లో పెరిగిన నమ్మకం, ప్రధానిగా ఎన్నికకావడం, ప్రధానిగా విదేశీ పర్యటనలు తదితరాలను చూపించారు. దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహబ్, సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
"ఒక చాయ్ వాలా... ప్రధాని అవుతాడా?", "నేను సన్యాసిని కావాలని అనుకుంటున్నాను", "దేశం కావాలని అనుకునేవారికి మరేమీ అవసరం లేదు , "ఆటంకవాదులను చూసి హిందుస్థాన్ కాదు... హిందుస్థాన్ ను చూసి ఆటంకవాదులు భయపడతారు", "ఒక్క నిమిషంలో నిర్ణయం తీసుకోకుంటే... అది అసలు నిర్ణయమే కాదు" అన్న అర్థం వచ్చేలా హిందీలో ఉన్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ 5వ తేదీన విడుదల కానున్న చిత్రం ట్రయిలర్ ను మీరూ చూడవచ్చు.