Jana Sena: ఐదు రోజుల క్రితం జనసేనలో చేరిక... ఇప్పుడు జగన్ వైపు చూపు!
- ఇటీవల జనసేనలో చేరిన దేవినేని మల్లికార్జునరావు
- టికెట్ దక్కకపోవడంతో అలక
- నేడో, రేపో వైసీపీలో చేరే అవకాశం
సరిగ్గా ఐదు రోజుల క్రితం జనసేన పార్టీ కండువా కప్పుకున్న గుంటూరు జిల్లా రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన పవన్, మొండి చెయ్యి చూపారని ఆరోపిస్తున్న ఆయన, నేడు తన అనుచరులతో సమావేశమై, సాయంత్రం లేదా రేపు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. దేవినేనితో చర్చించిన మాజీ మంత్రి మోపిదేవి రమణ, మేరుగ నాగార్జునలు, టికెట్ ఇవ్వలేకున్నా, పార్టీలో సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కాగా, 2004లో రేపల్లె నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా, దేవినేని చేరికతో, రేపల్లె, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ బలం పెరిగి, సులువుగా గెలుచుకోవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జనసేన నుంచి దేవినేనికి టికెట్ లభిస్తుందని తొలుత భావించినా, పవన్ మాత్రం కమతం సాంబశివరావువైపు మొగ్గు చూపారు. కమతానికి టికెట్ ఇస్తున్నట్టు మూడో జాబితాలో పేరును చేర్చారు. దీంతో ఆయన వర్గం తీవ్ర ఆగ్రహంలో ఉంది. జనసేనలో ఉండవద్దని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తుండగా, వైకాపాలో చేరేందుకు ఆయన సమాయత్తమవుతున్నారు.