ravi sasthri: రవిశాస్త్రి కొనసాగింపు ఉండకపోవచ్చు: బీసీసీఐ
- ప్రపంచకప్ చివరి మ్యాచ్ తో ముగియనున్న కాంట్రాక్ట్
- కనీసం సెమీస్ కు చేరితేనే శాస్త్రికి మరో అవకాశం
- ఎంపిక ప్రక్రియలను మళ్లీ పూర్తి చేయాల్సిందే
విదేశాలలో అంచనాలకు తగ్గట్టుగా రాణించి, సొంత గడ్డపై మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా విఫలమైంది టీమిండియా. వన్డే, టీ20 సిరీస్ లను చేజార్చుకుంది. దీంతో భారత క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, ప్రపంచకప్ లో భారత్ రాణిస్తే, చీఫ్ కోచ్ రవిశాస్త్రిని కొనసాగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. దీనిపై బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ, టీమిండియా ప్రపంచకప్ ను గెలిచినా రవిశాస్త్రికి పొడిగింపు ఉండబోదని తెలిపారు. శాస్త్రితో పాటు సంజయ్ బంగర్, శ్రీధర్, భరత్ అరుణ్ ల ఒప్పందం ప్రపంచ కప్ చివరి మ్యాచ్ తో ముగుస్తుందని చెప్పారు.
వీరంతా మళ్లీ తమ పదవుల్లో కొనసాగాలంటే ఎంపిక ప్రక్రియను మళ్లీ పూర్తి చేయాల్సిందేనని సదరు అధికారి తెలిపారు. ప్రపంచకప్ లో భారత్ కనీసం సెమీస్ కు చేరితేనే.. కోచ్ పదవిని మళ్లీ చేపట్టే అవకాశం రవిశాస్త్రికి ఉంటుందని చెప్పారు.