sv mohan reddy: టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు.. టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నా: ఎస్వీ మోహన్ రెడ్డి
- కర్నూలును టీజీ వెంకటేశ్ కన్నా నేనే ఎక్కువ అభివృద్ధి చేశా
- బుట్టా రేణుకను, నన్ను మోసం చేసి పంపించేశారు
- వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ కు మద్దతు ఇస్తా
తెలుగుదేశం పార్టీకి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారు. 2014లో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎస్వీ... ఇప్పుడు పార్టీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తన అనుచరులతో ఈరోజు సమావేశమైన ఎస్వీ... భవిష్యత్తుపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టీడీపీని వీడుతున్నానని ప్రకటించారు.
కర్నూలు పట్టణాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని... టీజీ వెంకటేశ్ కన్నా తాను చేసిన అభివృద్ధే ఎక్కువని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తనకు టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని... చివరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యవస్థలో తాను రాజకీయాలు చేయలేనని చెప్పారు. తనను, బుట్టా రేణుకను మోసం చేసి బయటకు పంపారని అన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకుంటున్నానని... మళ్లీ వైసీపీలో చేరుతానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి, జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
టీడీపీలో చేరుతానని తాను ఎవర్నీ అడగలేదని... భూమా నాగిరెడ్డిపై చంద్రబాబు ఒత్తిడి చేసి, తనను టీడీపీలో చేరేలా చేశారని మోహన్ రెడ్డి తెలిపారు. వైసీపీలో ఉంటే అభివృద్ధి చేయలేమనే కార్యకర్తల సూచన మేరకే టీడీపీలో చేరామని చెప్పారు. జగన్ తనకు అన్యాయం చేయలేదని... కానీ, వైసీపీకి అన్యాయం చేసి, తాము టీడీపీలో చేరామని అన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలన్నా, కార్యకర్తలను కాపాడుకోవాలన్నా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కార్యకర్తల నిర్ణయం మేరకు వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ కు మద్దతు ఇస్తానని తెలిపారు.