USA: జైషే మహ్మద్, లష్కరే తోయిబాపై పాక్ పటిష్ట చర్యలు తీసుకోవాలి: అమెరికా
- ఒకవేళ భారత్ పై మరో ఉగ్రదాడి జరిగితే?
- అదే జరిగితే మరోమారు ఉద్రిక్త పరిస్థితులు తప్పవు
- ఉగ్రవాద నిర్మూలనకు పాక్ నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలి
జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఇటీవల చేసిన దాడి లో భారత జవాన్లు అమరులైన ఘటన ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ ఘటనను భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను నిరోధించడానికి తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఎటువంటి చర్యలు చేపట్టిందన్న అంశంపై అగ్రదేశం అమెరికా అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ కు చెందిన ఓ అధికారి స్పందిస్తూ, ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్ నిర్మాణాత్మక, స్థిరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తోయిబా సంస్థల కార్యకలాపాలపై పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించిన ఆ అధికారి, ఒకవేళ భారత్ పై మరో ఉగ్రదాడి జరిగితే కనుక తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. తద్వారా భారత్-పాక్ దేశాల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని అన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక చర్యల కార్య దళం (ఎఫ్ఏటీఎఫ్) నుంచి పాక్ కు ముప్పు పొంచి ఉన్న కారణంగానే ఉగ్రవాద నిరోధక చర్యలకు ఆ దేశం పూనుకుందన్న అభిప్రాయాన్ని ఆ అధికారి వ్యక్తం చేశారు.పాక్ లో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఆ దేశం చర్యలు చేపట్టినట్టు అర్థమవుతోందని, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థల కార్యాకలాపాలపై నియంత్రణ విధించారని, ఉగ్రవాద సంస్థలకు చెందిన నేతల ఆస్తులను సైతం జప్తు చేసినట్టు ఆ అధికారి పేర్కొన్నారు. ఆర్థిక చర్యల కార్య దళం (ఎఫ్ఏటీఎఫ్) నుంచి ఇప్పటికీ పాక్ లోని ఉగ్రవాద సంస్థలకు చెందిన కొందరు నేతలు అక్కడ ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆ అధికారి ప్రస్తావించడం గమనార్హం.