Facebook: యూజర్ల పాస్ వర్డ్ లు మా ఉద్యోగులకు తెలుసు... షాకింగ్ న్యూస్ చెప్పిన ఫేస్ బుక్!
- పాస్ వర్డ్ లు ఇంటర్నల్ సర్వర్లలో దాచాం
- ఉద్యోగులు తప్ప బయటివారు చూడలేరు
- దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు లేవు
- వెల్లడించిన ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్
కోట్లాది మంది ఖాతాదారుల పాస్ వర్డ్ లు తమ ఉద్యోగులకు కనిపిస్తుంటాయని, ఇంటర్నల్ సర్వర్లలో వాటిని దాచామని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్ చేసింది. "మరింత స్పష్టంగా చెప్పాలంటే, ఈ పాస్ వర్డ్ లు ఫేస్ బుక్ బయటివారికి ఎన్నటికీ కనిపించవు. ఉద్యోగులకు కనిపిస్తుంటాయి. వాటిని మా ఉద్యోగులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఇంతవరకూ లేవు" అని సంస్థ ఇంజనీరింగ్, సెక్యూరిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ పెడ్రో కనాహువాటి తన బ్లాగ్ లో వెల్లడించారు. ఉద్యోగులకు పాస్ వర్డ్ లు కనిపిస్తాయన్న విషయాన్ని ఈ సంవత్సరం ప్రారంభంలోనే తాము తెలుసుకున్నామని ఆయన చెప్పడం గమనార్హం.
ఇప్పటికే డేటా భద్రతపై అందోళన వెల్లువెత్తుతున్న వేళ, పాస్ వర్డ్ లను ప్లెయిన్ టెక్ట్స్ ఫార్మాట్ లో సర్వర్లలో దాచామని, అవి సంస్థ ఉద్యోగులకు తప్ప మరొకరికి కనిపించవని చెప్పడం భద్రతా నిబంధనలకు విరుద్ధమేనని సైబర్ నిపుణులు మండిపడుతున్నారు. కాగా, ఫేస్ బుక్ పాస్ వర్డ్ ల విషయమై 'క్రెబ్స్ ఆన్ సెక్యూరిటీ డాట్ కామ్' అనే సెక్యూరిటీ న్యూస్ వెబ్ సైట్ గతంలోనే కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దాదాపు 60 కోట్ల మంది పాస్ వర్డ్ లు సాధారణ అక్షరాల్లో ఉన్నాయని, వీటిని సుమారు 20 వేల మంది ఉద్యోగులు చూస్తున్నారని సంస్థ తెలిపింది.