Bangaluru: వ్యూహం మార్చిన మోదీ.. బెంగళూరు సౌత్ నుంచి కూడా బరిలోకి?
- దక్షిణాదిపై పట్టు సాధించేందుకు మోదీ వ్యూహం
- అనంతకుమార్ భార్యను పక్కనపెట్టిన బీజేపీ
- వారణాసి, బెంగళూరు సౌత్ నుంచి ప్రధాని బరిలోకి!
ఈసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. దక్షిణాదిలో పట్టుసాధించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఈసారి ఎలాగైనా ఇక్కడ పెద్ద మొత్తంలో సీట్లు కొల్లగొట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరు సౌత్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా బరిలోకి దిగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
కర్ణాటకలో మొత్తం 28 సీట్లు ఉండగా, అందులో 21 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో బెంగళూరు సౌత్ లేకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. నిజానికి ఈ స్థానం నుంచి దివంగత కేంద్రమంత్రి అనంతకుమార్ భార్య తేజస్వినిని బరిలోకి దించాలని బీజేపీ భావించింది. అయితే, అనూహ్యంగా ఆమెను పక్కనపెట్టి మోదీ పేరును తెరపైకి తీసుకొచ్చారు.
బెంగళూరు సౌత్ నుంచి అనంతకుమార్ వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. అనంతకుమార్ మరణానంతరం ఆయన భార్య తేజస్వినిని బరిలోకి దించాలని బీజేపీ అధిష్ఠానం భావించింది. అయితే, ప్రధాని మోదీ దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించడంతో తేజస్వినిని పక్కనపెట్టారు. నిజానికి మోదీ వారణాసితోపాటు గాంధీ నగర్ నుంచి బరిలోకి దిగాలని భావించారు. అయితే, గాంధీనగర్ నుంచి పార్టీ చీఫ్ అమిత్ షా బరిలోకి దిగుతుండడంతో మోదీ బెంగళూరుకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది.