Andhra Pradesh: అందుకే నా కులస్తుడు చంద్రబాబును కాదని జగన్ వైపు నిలబడ్డాను!: కొడాలి నాని
- గుడివాడలో 40 వేల మంది రంగా అభిమానులున్నారు
- టీడీపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడిస్తారు
- వైసీపీ ఆత్మీయ సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే
గుడివాడ నియోజకవర్గంలో రంగా అభిమానులు 40,000 మంది ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ప్రజల కోసం నీతి, నిజాయతీగా పోరాటం చేసిన వ్యక్తి రంగా అని వ్యాఖ్యానించారు. అందుకే తన కులాన్ని కాదని రంగా వైపు నిలబడ్డానని అన్నారు. ఈరోజు వైసీపీ అధినేత జగన్ నీతిగా, నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని చెప్పారు. అందుకే తన కులస్తుడైన చంద్రబాబును కాదని జగన్ కు మద్దతుగా నిలబడ్డానని వ్యాఖ్యానించారు. వైసీపీ శ్రేణులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నాని మాట్లాడారు.
గుడివాడలో గెలవాలన్న చంద్రబాబు కలలు ఎన్నటికీ నెరవేరవని నాని స్పష్టం చేశారు. రంగాను చంపిన వ్యక్తి కుటుంబం నుంచి ఒకరిని తెచ్చి ఇక్కడ పోటీ చేయిస్తున్నారనీ, ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని వ్యాఖ్యానించారు. గుడివాడ గెలుపును వంగవీటి రంగాకు నివాళిగా అర్పిస్తామనీ, ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేస్తామని అన్నారు.
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి జగన్ ను ఉంచుతాడో, ఉంచడో తనకు తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గుడివాడలో అంగబలం, అర్థబలంతో తనను లేకుండా చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఈ నెల 25న నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.