rajendra prasad: మోహన్ బాబూ.. 'సిల్లీ ఫెలో' రాజకీయాలు వద్దు: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
- నీ కాలేజీకి డబ్బులన్నీ చెల్లించేశామని కుటుంబరావు చెప్పారు
- ప్రభుత్వం నుంచి బకాయిలు లేవని కాలేజీల అసోసియేషన్ కూడా చెప్పింది
- జగన్ మీద ప్రేమ ఉంటే.. వైసీపీ తరపున పోటీ చేసుకో
సినీ నటుడు మోహన్ బాబుపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. తమకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదంటూ నిన్న తిరుపతిలో మోహన్ బాబు తన కుమారులతో కలసి చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆయన తప్పుబట్టారు. ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఏమీ తెలియని అమాయక విద్యార్థులను రోడ్డుపైకి తీసుకొచ్చి, రాజకీయ డ్రామాలు ఆడారని విమర్శించారు. మోహన్ బాబు సినిమాలో ఉన్న డైలాగులానే... సిల్లీగా గల్లీలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
వైసీపీ అధినేత జగన్ పై మోహన్ బాబుకు అంత అభిమానం ఉంటే... ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, వైసీపీ తరపున పోటీ చేస్తున్నామని ధైర్యంగా ప్రకటించి ఉండాల్సిందని రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఈ ముసుగులో గుద్దులాటలు, పగటి వేషాలు మానేసి... నేరుగా జగన్ కు ఓటు వేయాలని జనాలను కోరితే బాగుంటుందని సూచించారు. లేకపోతే వైసీపీ తరపున పోటీ చేసుకోవాలని... ఎవరు కాదన్నారని ప్రశ్నించారు. ఇలాంటి 'సిల్లీ ఫెలో' వేషాలు వేస్తే ప్రజలు హర్షించరని అన్నారు.
ఏపీ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు నిన్న సవివరంగా శ్రీవిద్యానికేతన్ కు డబ్బు చెల్లించేశామని చెప్పారని... ఇంకా రాజకీయాలు ఎందుకని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో నీ ఒక్కడికే కాలేజీ ఉందా? నీవు ఒక్కడివే విద్యను అందిస్తున్నావా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో ఇంజినీరింగ్, మెడికల్, ఎంబీఏ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. ఏ కాలేజీ యాజమాన్యం కూడా తమకు ప్రభుత్వం బకాయి ఉందని ఇంత వరకు చెప్పలేదని... నీవు ఒక్కడివే ఇలా మాట్లాడుతున్నావంటే అర్థమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీపై బురద చల్లడమే కదా నీవు చేస్తున్న పని అని అన్నారు. వారం రోజుల క్రితం నీవు స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత... ఇంజినీరింగ్ కాలేజీల అసోసియేషన్ ముందుకు వచ్చి, ప్రభుత్వం తమకు బకాయి లేదని స్పష్టంగా ప్రకటించిందని తెలిపారు. ఎప్పటికప్పుడు తమ బకాయిలన్నీ చెల్లించేశారని స్పష్టంగా వారు తెలిపారని గుర్తు చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.