Rahul Gandhi: ఈసారి కేరళ నుంచి కూడా పోటీచేస్తున్న రాహుల్ గాంధీ!
- వాయనాడ్ బరిలో కాంగ్రెస్ అధినేత
- రాహుల్ అంగీకరించారు
- కేరళ కాంగ్రెస్ చీఫ్ వెల్లడి
అమేథీ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడు తన దృష్టిని దక్షిణాది వైపు మరల్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పట్టు పెంచుకోవాలంటే ఏదైనా ఓ రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి పోటీచేయాలని పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా రాహుల్ ను కోరారు. ఒకవేళ పోటీచేస్తే కర్ణాటకలోని కాంగ్రెస్ కంచుకోటల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని టాక్ వినిపించింది.
అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేరళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ ముళ్లప్పళి రామచంద్రన్ మీడియాకు వివరాలు తెలియజేశారు. వాయనాడ్ నుంచి బరిలో దిగేందుకు రాహుల్ అంగీకరించారని వెల్లడించారు. ప్రస్తుతం రాహుల్ ఉత్తరప్రదేశ్ లోని అమేథీ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలో దిగడం ద్వారా అటు ఉత్తరం, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సమప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలు పంపాలని రాహుల్ భావిస్తున్నారు.