Rahul Gandhi: ప్రాంతీయ పార్టీకి చెందిన వ్యక్తే ప్రధాని అవుతారు.. ఢిల్లీని యాచించం.. శాసిస్తాం: కేటీఆర్
- మద్దతు లేకుండా గద్దెనెక్కే పరిస్థితి లేదు
- అధికారంలో ఉండి పార్టీలేం చేశాయి
- సర్వేలో కేసీఆర్ ప్రథమ స్థానంలో ఉన్నారు
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే రాహుల్కు, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం కలుగుతుందని, కానీ టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్కు చెందిన కొందరు నేతలు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా గద్దెనెక్కే పరిస్థితి ఏ జాతీయ పార్టీకి లేదని, ఎక్కువ సీట్లు సాధిస్తే ప్రాంతీయ పార్టీకి చెందిన వ్యక్తే ప్రధాని అవుతారన్నారు.
ఎన్నికల అనంతరం ఢిల్లీని యాచించడం కాదని, శాసిస్తామని అన్నారు. అభివృద్ధి సాధ్యమన్న జాతీయ పార్టీ నేతలు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా విద్యుత్, తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించలేదని ఎద్దేవా చేశారు. 70 ఏళ్లపాటు అధికారంలో ఉండి పార్టీలు ఏం చేశాయని ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై సర్వే చేపడితే తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నారన్నారు. ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడు అనిపించుకుంటూ కేసీఆర్ ప్రజాదరణతో ముందుకు వెళుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.