chandrababu: విశాఖ ఏజెన్సీని ప్రత్యేక జిల్లా చేస్తాం: జగన్
- వైసీపీ పోరాటాల వల్లే బాక్సైట్ తవ్వకాలు ఆగిపోయాయి
- ఏజెన్సీలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం
- గిరిజనులు, దళితులను చంద్రబాబు మోసం చేశారు
టీడీపీ అండదండలతో విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మాఫియా రెచ్చిపోతోందని, వైసీపీ చేసిన పోరాటాల వల్లే బాక్సైట్ తవ్వకాలు కొంత వరకు ఆగిపోయాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలను జరపబోమని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలను నెలకొల్పుతామని చెప్పారు. విశాఖ ఏజెన్సీని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపారు.
ఐదేళ్ల పాలనలో మద్యం అమ్మకాలు, రైతుల ఆత్మహత్యలలో ఏపీని చంద్రబాబు నెంబర్ వన్ స్థానంలో నిలిపారని జగన్ విమర్శించారు. గిరిజనులు, దళితులకు అన్యాయం చేసిన మోసపూరిత ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని చెప్పారు. చంద్రబాబు పాలనలో పేదల బతుకులు బాగుపడలేదని అన్నారు. గత ఐదేళ్లలో ఏం చేశారో చెప్పకుండా, మరోసారి గెలిపించాలంటూ చంద్రబాబు మీ ముందుకు వస్తున్నారని, మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.