Vijayawada: ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాం: పవన్ కల్యాణ్
- మా అభ్యర్థి మహేశ్ ను గెలిపించాలి
- వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లికి పార్టీలు మారడమే పని
- నాడు జనసేనపై టీడీపీ, వైసీపీలు విమర్శలు చేశాయి
ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థి మహేశ్ ను గెలిపించాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన అని అన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పై విమర్శలు చేశారు. ఎన్నో పార్టీలు మారి వైసీపీలోకి వచ్చిన వెల్లంపల్లికి పార్టీలు మారడం తప్ప వేరే పని లేదని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ లో కూర్చుని పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారని, అక్కడి నుంచే తమ అభ్యర్థులకు బీ ఫారమ్ లు ఇస్తారని విమర్శించారు.
పాపం, ముఖ్యమంత్రి గారేమో, తన క్యాంపు ఆఫీసు నుంచే పార్టీని నడుపుతున్నారని, కేవలం, జనసేన పార్టీయే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని బీ ఫారమ్స్ ఇచ్చిన పార్టీ అని అన్నారు. నాడు జనసేన పార్టీపై టీడీపీ, వైసీపీలు తీవ్ర విమర్శలు చేశాయని, తమ పార్టీకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఉంటాడా? అని విమర్శించారని, సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతానని అప్పుడు అనుకున్నానని అన్నారు.