Vijayawada: ఐదేళ్లు గడుస్తున్నా అమరావతి నిర్మాణం జరగలేదు!: ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు
- 5 వేల ఎకరాలతో అంచెలంచెలుగా ప్రారంభించే వాడిని
- ఇన్ని లక్షలతో రాజధాని నిర్మించాల్సిన అవసరం రాదు
- అభివృద్ధి అనేది అంచెలంచెలుగా జరగాలి
ఐదేళ్లు గడుస్తున్నా అమరావతి నిర్మాణం జరగలేదని, అన్నీ తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. విజయవాడలోని సింగ్ నగర్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘నేనే కనుక ముఖ్యమంత్రిని అయి ఉంటే, ఇన్ని లక్షలతో రాజధాని నిర్మించాల్సిన అవసరం రాదు. ఐదు వేల ఎకరాలతో అంచెలంచెలుగా ప్రారంభించే వాడిని’ అని అన్నారు.
అభివృద్ధి అనేది అంచెలంచెలుగా జరగాలని సూచించిన పవన్ కల్యాణ్, అప్పులను ప్రజలపైకి నెట్టడం కరెక్టు కాదని అన్నారు. ఎక్కడ ఏ బిల్డింగ్ వస్తుందో ఏం జరుగుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలుసని, బోండా ఉమా లాంటి వాళ్లకు ఇందుకు సంబంధించిన సమాచారం ఉంటుందని విమర్శించారు. మనతో ఓట్లు వేయించుకుని డబ్బులు వాళ్లు సంపాదిస్తున్నారని, ‘సంపద’ అనేది అందరికీ రావాలని, కొద్ది మంది చేతుల్లోనే ఆ సంపద ఉంటే కుదరదని అన్నారు. వేలకు వేల కోట్లు దోచేస్తున్నారే తప్ప ఒక్క ఉద్యోగం రావట్లేదని, ఇది ఆగాలంటే, మార్పు రావాలని, ఆ మార్పు జనసేన కూటమితోనే సాధ్యమని అన్నారు.