Jana Sena: జనసేన, సీపీఐ పొత్తుకు బీటలు... పవన్ ను వదిలేసేందుకు వామపక్షాల సమాలోచనలు!
- విజయవాడ సీటును సీపీఐకి ఇచ్చిన పవన్
- ప్రచారం చేసుకుంటున్న చలసాని అజయ్
- నిన్న ముత్తంశెట్టి పేరును చెప్పిన జనసేన అధినేత
- పొత్తే వద్దంటున్న సీపీఐ శ్రేణులు
జనసేన, సీపీఐల మధ్య కుదిరిన పొత్తుకు బీటలు పడుతున్నాయి. జనసేనతో పొత్తు వద్దని, ఒంటరిగా అన్ని స్థానాల్లోనూ పోటీకి దిగాలని ఇప్పుడు సీపీఐ భావిస్తోంది. పొత్తులో భాగంగా విజయవాడ లోక్ సభ స్థానాన్ని తమకు కేటాయించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ఆ స్థానాన్ని ఇంకొకరికి ఇస్తున్నట్టు ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.
సీపీఐ నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమైన చలసాని అజయ్, గత వారం రోజులుగా ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, నిన్న విజయవాడలో పర్యటించిన పవన్, లోక్ సభ స్థానానికి ముత్తంశెట్టి పోటీ చేయనున్నారని, ఆయన సోమవారం నాడు నామినేషన్ వేస్తారని చెప్పారు. ఇదే సీపీఐ కోపానికి కారణమైంది.
దీంతో పవన్ మిగతా సభలకు దూరంగా ఉన్న సీపీఐ నేతలు, పొత్తు ధర్మాన్ని పవన్ విస్మరించారని విమర్శలు గుప్పిస్తున్నారు. పొత్తులో భాగంగా నూజివీడు, విజయవాడ సీట్లను తమకు కేటాయించారని గుర్తు చేస్తున్న నాయకులు, ఇప్పుడు వాటిల్లోనూ తన అభ్యర్థులనే పవన్ నిలపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక జనసేనతో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయంలో నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.