Deve Gowda: తుముకూరు నుంచి బరిలోకి దిగుతున్న మాజీ ప్రధాని దేవెగౌడ
- మనవడి కోసం హసన్ సీటును వదులుకున్న దేవెగౌడ
- తుముకూరు సీటును జేడీఎస్‌కు కేటాయించడంపై కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అలక
- తాను కూడా బరిలోకి దిగుతానన్న ముద్దహనుమేగౌడ
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ ఈ ఎన్నికల్లో తుముకూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. శనివారం ఈ విషయాన్ని పార్టీ వెల్లడించింది. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమానికి జేడీఎస్-కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నట్టు పేర్కొంది. దేవెగౌడ ప్రస్తుతం హసన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఆ సీటును వదులుకున్నారు.
కాగా, హసన్ సీటును జేడీఎస్‌కు కేటాయించడంపై ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఎస్పీ ముద్దహనుమేగౌడ గుర్రుగా ఉన్నారు. పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాను కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు సహకరించేందుకు నిరాకరిస్తుండడంతో దేవెగౌడ పరిస్థితి సంకటంగా మారింది. మరోవైపు, ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన మాజీమంత్రి ఎ.మంజు హసన్ నుంచి బరిలోకి దిగుతున్నారు.