Hyderabad: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అందుబాటులోకి వచ్చిన మరో డొమెస్టిక్ టెర్మినల్!
- 4 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఐడాట్
- రోజుకు 30 వేల మందికి సేవలు
- నాలుగు బ్యాగేజ్ బెల్ట్ ల ఏర్పాటు
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నూతనంగా నిర్మించిన ఐడాట్ (ఇంటర్మ్ డొమెస్టిక్ ఎరైవల్స్ టెర్మినల్) అందుబాటులోకి వచ్చింది. దాదాపు 4 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్, ప్రస్తుతం ఉన్న పాసింజర్ టెర్మినల్ భవంతికి తూర్పు వైపున ఉంటుంది. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల బ్యాగేజీ రీక్లయిమ్, మరో గమ్యస్థానానికి వెళ్లేవారికి అందించే సేవలు అందనున్నాయి. ఒక్కొక్కటి 45 మీటర్ల పొడవైన నాలుగు బ్యాగేజ్ బెల్ట్ లనూ ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టుకు వచ్చే సగం మంది దేశవాళీ ప్రయాణికులకు... అంటే, నిత్యమూ ల్యాండ్ అయ్యే సుమారు 30 వేల మంది ఈ ఐడాట్ నుంచే బయటకు వెళ్లేలా జీఎంఆర్ అధికారులు ఏర్పాటు చేశారు.