Russia: చెంపదెబ్బలకు కూడా టోర్నమెంట్... గెలిచినవారికి నగదు బహుమతులు!
- రష్యాలో వీకెండ్ పోటీలు
- మూడు దెబ్బల్లో మట్టికరిపించాలి
- వేలల్లో ప్రైజ్ మనీ
బాక్సింగ్, మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ వంటి ఫైటింగ్ పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ చెంపదెబ్బలకు కూడా ఓ టోర్నమెంట్ నిర్వహిస్తారంటే ఆశ్చర్యం కలగకమానదు. రష్యాలోని క్రాస్నోయాస్క్ ప్రాంతంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. బాగా కష్టపడి పనిచేసే స్వభావమున్న రష్యన్లు వీకెండ్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే వారాంతాల్లో ఇలాంటి విచిత్రమైన పోటీలు పెట్టుకుని ఆస్వాదిస్తారు. ఈ చెంపదెబ్బల పోటీలో ఒక్కొక్క పోటీదారుడికి మూడు చాన్సులు ఇస్తారు. ఆ మూడు దెబ్బల్లో అవతలి వ్యక్తిని చెంపదెబ్బలు కొట్టడం ద్వారా మట్టికరిపించాలి.
ఓ టేబుల్ కు ఇరువైపులా పోటీదారులు నిలుచుంటారు. అంపైర్ సమక్షంలో చెరో మూడు దెబ్బలు కొట్టాలి. ఆ లోపే ఎవరన్నా పడిపోతే అవతలి వ్యక్తి గెలిచినట్టు ప్రకటిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనే వ్యక్తులకు చెంపలు బూరెల్లా పొంగిపోవడం సాధారణమైన విషయం. కొన్నిసార్లు దవడ కూడా పగులుతుంది కాబట్టి పోటీ ముగిసిన వెంటనే డాక్టర్ తో వైద్యపరీక్షలు చేయించి అవసరమైతే ఉచితంగా చికిత్స అందిస్తారు. ఇక, ఈ టోర్నమెంట్ లో విజేతలకు వేలల్లో ప్రైజ్ మనీ ఉంటుంది. కొన్ని పోటీల్లో విన్నర్ కు రూ.32 వేల వరకు ఇస్తారు.