Cricket: ఏడాది నిషేధానికి గురైనా చేవ తగ్గని వార్నర్... కోల్ కతాపై వీరవిహారం
- 53 బంతుల్లో 85 పరుగులు చేసిన వార్నర్
- నైట్ రైడర్స్ పై ఫిఫ్టీ
- సునాయాసంగా బ్యాటింగ్ చేసిన వైనం
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ బంతిని బలంగా బాదే బ్యాట్స్ మన్లలో ముందుంటాడు. వార్నర్ ఎంతటి విధ్వంసకారుడో అతడి బ్యాట్ జోరుకు బలైన బౌలర్లు చెబుతారు. బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్టు తేలడంతో ఏడాది నిషేధానికి గురైనా ఆ ఛాయలేమీ కనిపించకుండా, తాజాగా ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్ బౌలర్లను ఊచకోత కోశాడు.
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ లో వార్నర్ కేవలం 53 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. సాధారణంగా సంవత్సరం పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న ఆటగాళ్లు లయ అందుకోవాలంటే చాలా కష్టం. కానీ వార్నర్ ఆ ప్రభావం తనపై ఎంతమాత్రం లేదని చాటుతూ బంతిని బౌండరీలు దాటించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ వార్నర్ చలవతో 3 వికెట్లకు 181 పరుగులు చేసింది.