kollywood: నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యల ఫలితం.. సీనియర్ నటుడు రాధారవికి షాక్!
- నయనతారపై అనుచిత వ్యాఖ్యలతో కోలీవుడ్‌లో కలకలం
- రాధారవిని ఇకపై సినిమాల్లోకి తీసుకోబోమన్న కేజేఆర్ స్టూడియోస్
- ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రముఖ స్టార్ నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ సీనియర్ నటుడు రాధారవికి ప్రముఖ నిర్మాణ సంస్థ కేజేఆర్ స్టూడియోస్ భారీ షాకిచ్చింది. ఇకపై ఆయనను తమ సినిమాలకు తీసుకోబోమని ప్రకటించింది. అంతేకాదు, ఆయనతో కలిసి పనిచేయవద్దని ఇతర నటీనటులను, నిర్మాణ సంస్థలను కోరింది. ‘అరం’, ‘విశ్వాసం’, ‘ఐరా’ వంటి సినిమాలను నిర్మించింది ఈ సంస్థే.
మరోవైపు రాధారవి వ్యాఖ్యలపై కోలీవుడ్ నటులు మండిపడుతున్నారు. ఓ సీనియర్ నటుడు మాట్లాడాల్సిన మాటలు కావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధారవి సోదరి రాధిక, నటి వరలక్ష్మి శరత్ కుమార్, దర్శకుడు విఘ్నేశ్ శివన్, గాయని చిన్మయి తదితరులు రాధారవిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ సినిమా ట్రైలర్ కార్యక్రమానికి వెళ్లి అదే నటిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే కార్యక్రమానికి హాజరైన వారు నవ్వుతూ చప్పట్లు కొట్టడం బాధాకరమని కేజేఆర్ స్టూడియోస్ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ లెజండరీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొంది. గొప్పతనం పేరులో ఉండదని, మాట తీరులోనే ఉంటుందని స్పష్టం చేసింది.
రాధారవి వ్యాఖ్యలను నడిగర్ సంఘం గుర్తించే ఉంటుందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నట్టు నిర్మాణ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. మన మహిళలకు మనమే మద్దతు ఇవ్వాలని, రాధారవిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేజేఆర్ స్టూడియోస్ డిమాండ్ చేసింది.