shruthi haasan: శ్రుతిహాసన్ ను బ్లాక్ మెయిల్ చేశారు: పీవీపీపై కేశినేని నాని ఆరోపణలు
- బ్లాక్ మెయిల్ చేసి కాల్ షీట్లు తీసుకున్నారు
- హీరోలు, డైరెక్టర్లను ఏడిపించారు
- పీవీపీ చిన్నప్పటి నుంచే నేరగాడు
సినీ నటి శ్రుతిహాసన్ ను పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) బ్లాక్ మెయిల్ చేశారని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, కాల్ షీట్లు తీసుకున్నారని అన్నారు. సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లను ఆయన ఏడిపించారని, మహేశ్ బాబును తప్ప ప్రతి హీరోను ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఒక్క మహేశ్ బాబు మాత్రమే పీవీపీ చేతికి చిక్కలేదని అన్నారు. డైరెక్టర్లను కూడా ఏడిపించారని విమర్శించారు. లీగల్ నోటీసుల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి, డేట్లను తీసుకునేవారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఇతనంటే అసహ్యం పుట్టిందని చెప్పారు.
పీవీపీ ఒక క్రిమినల్, ఒక మోసగాడు అంటూ కేశినేని నాని విమర్శించారు. చిన్నప్పటి నుంచే నేరగాడని అన్నారు. కెనరాబ్యాంకుకు రూ. 137 కోట్లు ఎగ్గొడితే మొన్ననే నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్లు వేళం వేస్తే, కనీసం రూ. 7 కోట్లు కూడా రాలేదని చెప్పారు. జగతి పబ్లికేషన్స్ లో రూ. 147 కోట్ల మనీలాండరింగ్ కేసులు, హవాలా కేసులు, బొగ్గు స్కాములు ఉన్నాయని అన్నారు. సెబీ కూడా రూ. 30 కోట్ల ఫైన్ వేసిందని చెప్పారు. విజయవాడ లోక్ సభ ఎన్నికల బరిలో టీడీపీ నుంచి కేశినేని, వైసీపీ నుంచి పీవీపీ పోటీపడుతున్న సంగతి తెలిసిందే.