Uttar Pradesh: అక్రమాస్తుల కేసులో ములాయం, అఖిలేష్‌కు సుప్రీం ఝలక్

  • దర్యాప్తు వివరాలు రెండు వారాల్లో అందించాలని సీబీఐకి ఆదేశం
  • వారిపై ఉన్న ఇతర కేసులు కూడా తెలపాలని సూచన
  • జస్టిస్‌ రంజన్‌గొగోయ్‌, జస్టిస్‌ దీపక్‌గుప్తా బెంచ్‌ ఆదేశాలు

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు ములాయంసింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. తాను వేసిన అక్రమాస్తులు కేసులో ఎటువంటి పురోగతి లేదంటూ పిటిషనర్‌, కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్‌ చతుర్వేది కోర్టు దృష్టికి తేవడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగోయ్‌, జస్టిస్‌ దీపక్‌గుప్తాలతో కూడిన బెంచ్‌ స్పందించింది.

కేసు దర్యాప్తు వివరాలను రెండు వారాల్లోగా తెలియజేయాలని, అలాగే వారిపై ఉన్న ఇతర కేసుల వివరాలు అందించాలని ఆదేశించారు. ములాయం, అఖిలేష్‌లు అక్రమాస్తులు కలిగి ఉన్నారని, వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ 2005లో కాంగ్రెస్‌నేత విశ్వనాథ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అఖిలేష్‌, ములాయం, అఖిలేష్‌ భార్య డింపుల్‌పై ఆరోపణలు చేశారు. పిటిషన్‌ స్వీకరించిన కోర్టు 2007లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

2012లో ములాయం, అఖిలేష్‌లు వేసిన రివ్యూ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. తాను ప్రజాప్రతినిధిని కానని, తనను మినహాయించాలని డింపుల్‌ వేసిన పిటిషన్‌ను అనుమతించిన కోర్టు ములాయం, అఖిలేష్‌లపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. ఈ కేసులో పురోగతి లేదని తాజాగా మళ్లీ విశ్వనాథ్‌ కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News