Andhra Pradesh: చంద్రబాబు నమ్మించి మోసం చేశారు.. అందుకే వైసీపీలోకి వెళుతున్నా!: కొత్తపల్లి సుబ్బారాయుడు
- అభిమానులు, మద్దతుదారుల సమక్షంలో టీడీపీకి రాజీనామా
- నాకు టికెట్ ఇవ్వకున్నా బాధపడేవాడిని కాదు
- కానీ నన్ను సంప్రదించకుండా నరసాపురం టికెట్ మరొకరికి ఇచ్చారు
టీడీపీ అధినేత చంద్రబాబు నరసాపురం టికెట్ ఇవ్వకపోవడంలో ఇప్పటికే అలకపాన్పు ఎక్కిన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం తన అభిమానులు, మద్దతుదారుల సమక్షంలో రాజీనామా పత్రాలపై సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని కొత్తపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
టికెట్ తనకు ఇవ్వకపోయినా ఫరవాలేదనీ, కానీ తనను సంప్రదించకుండా నరసాపురం టికెట్ ను మరొకరికి కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు 10 మంది కౌన్సిలర్లు, వేలాది మంది కార్యకర్తలు ఈరోజు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే తాను వైసీపీలో చేరుతానని కొత్తపల్లి ప్రకటించారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతాం. మా సత్తా ఏంటో చూపిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్. ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. నర్సాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. నా ప్రతాపం పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో చూపిస్తాను. రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలవడానికి నేను ప్రచారం చేస్తా’ అని ప్రకటించారు.