Andhra Pradesh: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను శుక్రవారం విడుదల చేస్తాం.. ఈరోజు సర్టిఫికేషన్ వచ్చేస్తుంది!: నిర్మాత రాకేశ్ రెడ్డి
- ఈసీ నోటీసులకు స్పందించిన రాకేశ్ రెడ్డి
- ఏపీ సీఈవో గోపాలకృష్ణతో భేటీ
- అన్ని ఆరోపణలపై సమగ్ర వివరణ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత రాకేశ్ రెడ్డి ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా సినిమాలోని సీన్ల విషయం, అభ్యంతరకర సీన్లపై ఈసీ అధికారులు లేవనెత్తిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈ శుక్రవారం(మార్చి 29) విడుదల అవుతుందని రాకేశ్ రెడ్డి తెలిపారు.
ఈ సినిమాకు సంబంధించి ఈరోజు సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేషన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఏ పార్టీకి సంబంధించిన గుర్తులు, జెండాలను వాడుకోలేదని స్పష్టం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈసీకి రాతపూర్వకంగా అందజేశానని పేర్కొన్నారు. తమపై వచ్చిన ఆరోపణలకు సమగ్రంగా వివరణ ఇచ్చామన్నారు.
గతంలో జరిగిన వాస్తవాలను మాత్రమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపిస్తున్నామనీ, ఎవ్వరినీ లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కీలకాంశాలను ఇందులో చూపెడతామని వర్మ అప్పట్లో ప్రకటించారు.