Andhra Pradesh: కేజీ ఉల్లిపాయలను రూపాయికి కూడా కొనరు.. కానీ హెరిటేజ్ లో మాత్రం రూ.23కు అమ్ముతున్నారు!: వైఎస్ జగన్

  • మామను మోసం చేసినోడు ప్రజలను చేయడా?
  • కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం
  • బాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి

సొంత మామను మోసం చేసిన చంద్రబాబు ప్రజలను మోసం చేయడా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతన్నలు ఉల్లిపంటను పొలాల్లోనే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలకు తెల్లరేషన్ కార్డులు ఉన్నాయనీ, అంటే వీరంతా పేదలేనని వ్యాఖ్యానించారు. అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి సర్వీసులను పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ లో దళారుల రాజ్యం నడుస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతుల దగ్గరేమో కేజీ ఉల్లిపాయలను రూపాయికి కూడా కొనరు. కానీ హెరిటేజ్‌ షాపుల్లో మాత్రం కేజీ రూ. 23కు అమ్ముతున్నారు. దీన్నిబట్టి దళారీల వ్యవస్థ ఏ స్థాయికి పోయిందో చెప్పనవసరం లేదు. దళారీ వ్యవస్థను కట్టడి చేయాల్సిన వ్యక్తే వారితో జత కట్టారు. టమోటా, పత్తి పరిస్థితి కూడా ఇదే. ఇటువంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇంతటి దారుణ పాలనలో నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను చూశాను. అతి దగ్గర నుంచి మీ బాధలు విన్నాను. మీ అందరితో మమేకమయ్యాను కాబట్టి .. ‘మీ అందరికి నేనున్నాను’ అని హామీ ఇస్తున్నాను’’ అని తెలిపారు.

చంద్రబాబు నాయుడు ఇచ్చే రూ.3,000కు మోసపోవద్దని అవ్వాతాతలకు చెప్పాల్సిందిగా వైసీపీ శ్రేణులకు జగన్ సూచించారు. ‘మీరందరూ గ్రామాలకు వెళ్లండి. ప్రతీ ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3,000లకు మోసపోవద్దనీ, 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని వివరించండి.

డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా, ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాడని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల పింఛన్‌ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి’ అని వైఎస్‌ చెప్పారు. 

  • Loading...

More Telugu News