CWC: మేము అధికారంలో కొస్తే ప్రతి పేదోడికి ఏడాదికి రూ.72,000 జమ చేస్తాం: రాహుల్ గాంధీ
- ‘కనీస ఆదాయ భరోసా’ పథకాన్ని అమలు చేస్తాం
- ప్రపంచంలో ఎక్కడా అమలు కాని పథకమిది
- భారత్ లోని 20 శాతం మంది పేదలు లబ్ధి పొందుతారు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తే కనుక పేదలకు ‘కనీస ఆదాయ భరోసా’ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా పేదలకు చేకూరే లబ్ధి గురించి ఈరోజు ఆయన వెల్లడించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం (సీడబ్ల్యుసీ) ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. అనంతరం, మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావట్లేదని చెప్పారు. భారత్ లోని 20 శాతం మంది పేదలు అంటే, ఐదు కోట్ల కుటుంబాల్లో 25 కోట్ల మంది పేదలు దీని ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో నేరుగా ఏడాదికి రూ.72,000 జమ చేస్తామని, ఇందుకు సంబంధించిన అన్ని గణాంకాలను సరి చూసుకున్నామని చెప్పారు.