Telangana: ఏమాటకామాట చెప్పుకోవాలి జగన్ నిజం చెప్పాడు: బుద్ధా వెంకన్న సెటైర్లు
- ప్రజాధనం దోచుకున్న జగన్ ఎవరికైనా ఫోన్ చేశారా?
- అఫిడవిట్ లో ఆస్తులపై జగన్ తప్పుడు లెక్కలు
- ఏ వ్యాపారాలు చేసి జగన్ అంత ఆస్తి సంపాదించారు?
ఏమాటకామాట చెప్పుకోవాలి జగన్ నిజం చెప్పాడని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో తనకు సంబంధాలు ఉన్నాయన్న ముసుగును జగన్ తీశారని ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు విసిరారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నాకు వెయ్యికోట్లు ఇచ్చినట్టు చంద్రబాబుకు కేసీఆర్ ఏమన్నా చెప్పారా? నేను ఏమన్నా చెప్పానా?’ అంటూ దీర్ఘాలు తీసుకుంటూ జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
రూ.43 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నప్పుడు ఎవరికైనా జగన్ ఫోన్ చేసి చెప్పారా? అని ప్రశ్నించారు. ఇవన్నీ కూడా దొంగతనాలు చేసే వాళ్లెవరూ బయటకు చెప్పరని విమర్శించారు. అఫిడవిట్ లో జగన్ ఆస్తులు కూడా తప్పుడు లెక్కలేనని, ఏ వ్యాపారాలు చేసి ఆయన అంత ఆస్తి సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘మీ ‘సాక్షి’ టీవీ, పేపరు కూడా లాస్ లోనే ఉన్నాయి కదా?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో కేసీఆర్ కు లొంగిపోయి, ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న జగన్ ని చూసి తాము కూడా సిగ్గుపడుతున్నామని అన్నారు. ఎందుకంటే, ఈ రాష్ట్రంపై తమకు ఉన్న మమకారాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర జగన్ తాకట్టుపెట్టారని అందుకే, తాము కూడా సిగ్గుపడుతున్నామని చెప్పారు.