Chandrababu: దేనికైనా తెగించేందుకు సిద్ధం: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- రాష్ట్రంపై మరిన్ని కుట్రలు, కుతంత్రాలు
- రేపు ఓటింగ్ మిషన్ దొంగలు రానున్నారు
- ఈసీ కూడా కేంద్రం ఆదేశాలతోనే పనిచేస్తోంది
- పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు
రాబోయే రోజుల్లో వైసీపీతో కలిసిన బీజేపీ రాష్ట్రంపై మరిన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతుందని, వారిని ఎదిరించేందుకు ఎంతకైనా తెగించేందుకు తాను సిద్ధమని, తెలుగుదేశం శ్రేణులు కూడా ఏ పరిస్థితి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ ఉదయం కార్యకర్తలు, నాయకులతో మాట్లాడిన ఆయన, అధికారుల బదిలీలను ప్రస్తావించారు.
కనిగిరి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి చెందిన ఆసుపత్రిపై దాడులకు దిగడం కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని అభిప్రాయపడ్డ చంద్రబాబు, ఎవరెన్ని కుట్రలు పన్నినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు టీడీపీ వెంట ఉన్నారని, కేంద్రం చర్యలతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జగన్ కోరిక మేరకు నరేంద్ర మోదీ, అమిత్ షాలు పని చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు, తన భద్రతను పర్యవేక్షించే అధికారిని బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్ సైతం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తోందని అన్నారు. అవసరమైతే ఈసీ తీరుపై జాతీయ స్థాయిలో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. నిన్నటి వరకూ ఓట్లను దొంగిలించే దొంగలు వచ్చారని, రేపు ఓటింగ్ మిషన్ దొంగల రూపంలో వారే రానున్నారని, టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.