Andhra Pradesh: ఫామ్-7 విషయంలో వైసీపీ నేతలపై 500 కేసులు నమోదయ్యాయి.. చర్యలు ఎందుకు తీసుకోలేదు?: చంద్రబాబు
- పోలీసుల బదిలీలపై రాజకీయ పోరాటం చేస్తాం
- మోదీ-అమిత్ షా భయంకరమైన వ్యక్తులు
- కర్నూలులో మీడియాతో టీడీపీ అధినేత
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను భ్రష్టు పట్టించాలని వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈసీ చర్యలు తీసుకోవడం నిజంగా బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీలో ఫామ్ -7 ద్వారా ఓట్ల తొలగింపునకు యత్నించినందుకు ఏకంగా 500 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. దీనిపై ఈసీ ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఈసీ అధికారులు నేరస్తులకు అండగా నిలబడి, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటే వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదన్నారు. కర్నూలు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత మాట్లాడారు.
ఏపీలో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ విషయమై న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయమై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భయంకరమైన వ్యక్తులని తాను ఆరోజే చెప్పానని చంద్రబాబు అన్నారు. వీరిద్దరూ భారత్ ను నాశనం చేసి భ్రష్టు పట్టిస్తారని హెచ్చరించారు. ఇందులో భాగంగానే వైసీపీ, టీఆర్ఎస్ లను బీజేపీ పక్కన పెట్టుకుందని దుయ్యబట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోరాడినా 25 లక్షల ఓట్లు తొలగించారని చంద్రబాబు తెలిపారు. అయినా ఇంకా చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పులను 50 శాతం లెక్కించడానికి ఈసీకి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. మహా అయితే ఓ గంట లేట్ అవుతుందనీ, కానీ అందరి అనుమానాలు తీరుతారని వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఆసుపత్రిపై ఐటీ దాడులు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నరేంద్ర మోదీ రేపు ఏపీకి వస్తున్నారనీ, ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష వైసీపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతోందనీ, అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. ఈ విషయంపై ఈసీ విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు.