Andhra Pradesh: కేసీఆర్ తో అంటకాగిన జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారు!: నారా లోకేశ్
- పోలవరాన్ని కేసీఆర్ అడ్డుకునేందుకు యత్నించారు
- ‘పసుపు-కుంకుమ’ తీసేసే జగన్ కు ఓటేయాలా?
- విశాఖ జిల్లా అరకులో నారా లోకేశ్ వ్యాఖ్య
పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నించారని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. అలాంటి వ్యక్తితో అంటకాగిన వైసీపీ అధినేత జగన్ కు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విభజన హామీల అమలు విషయంలో మోదీ నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని అరకులో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో లోకేశ్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్ ఇకపై తన పేరును ‘కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి’గా మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఏపీలో ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని తీసేసే వ్యక్తికి ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.