Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు!: కాంగ్రెస్ నేత విజయశాంతి
- మోదీ దయ, ఈవీఎంల గోల్ మాల్ తో కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు
- సీఎం అయ్యాక కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్నారు
- హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ దయతో, ఈవీఎంల గోల్మాల్తో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత, నటి విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడకు చెంపపెట్టని వ్యాఖ్యానించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి మీడియాతో మాట్లాడారు.
అయితే టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, విద్యావంతులు తీర్పు ఇచ్చారని విజయశాంతి తెలిపారు. తెలంగాణలోని 16 సీట్లను గెలిపిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని విద్యావంతులకు భయం పట్టుకుందనీ, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించారని ఎద్దేవా చేశారు. దీనివల్ల కేసీఆర్ కు కనువిప్పు కలగకపోయినా, టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్మశోధన చేసుకోవాలన్నారు.