Andhra Pradesh: తమ్ముళ్లూ.. బుక్కపట్నం చెరువుకు నీళ్లు వస్తాయని మీ కలలోనైనా అనుకున్నారా?: సీఎం చంద్రబాబు
- పాదయాత్రలో పేదల కష్టాలు చూసి పెన్షన్ పెంచాను
- నాలుగు, ఐదో విడత రుణమాఫీ చెక్కులు ఏప్రిల్ లో ఇస్తా
- పుట్టపర్తి బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి
నర్సమ్మను చూడగానే తాను గత ఐదేళ్లుగా పడిన కష్టాన్ని మర్చిపోయానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పాదయాత్రలో వృద్ధుల కష్టాలను చూసి పెన్షన్ ను రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచానని అన్నారు. తాజాగా దాన్ని రూ.2000కు చేశామని పేర్కొన్నారు. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని మాట ఇచ్చి 10 రెట్లు భరోసా కల్పించానని చెప్పారు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో ఈరోజు నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు.
‘నా పెద్ద కొడుకు వచ్చాడు. నా పెద్దకొడుకే ఎన్నికల్లో గెలవాలి’ అన్న తపన నర్సమ్మ మోహంలో కనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నర్సమ్మ చాలా ఆనందంగా ఉన్నారన్నారు. టీడీపీ హయాంలో ప్రతీఒక్కరూ లాభపడ్డారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాల ద్వారా అందరికీ లబ్ధి చేకూరిందన్నారు. దివ్యాంగులకు రూ.10 వేలు ఇచ్చి మానవత్వంతో ఆదుకున్నామని చెప్పారు. రైతులకు రూ.24,500 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ‘నాలుగో విడత, ఐదో విడత రుణమాఫీ చెక్కును ఏప్రిల్ మొదటివారంలో మీ బ్యాంకులో వేస్తున్నా.. తీసుకోండి’ అని రైతన్నలకు సూచించారు. అనంతపురంలోని బుక్కపట్నం చెరువుకు నీళ్లు తీసుకొచ్చామన్న చంద్రబాబు.. ‘తమ్మూళ్లూ.. మీ కలలో అయినా అనుకున్నారా బుక్కపట్నం చెరువుకు నీరు వస్తుందని?’ అని ప్రశ్నించారు.
కృష్ణా జాలాలను ఒక్క బుక్కపట్నం చెరువుకే కాకుండా మిగతా అన్ని ప్రాంతాలకు అందిస్తామన్నారు. భగీరథుడు గంగానదిని భూమిపైకి తెచ్చాడన్నారు. అదే విధంగా శ్రీశైలంలోని బుక్కపట్నం చెరువుకు భగీరథ ప్రయత్నం ద్వారా నీటిని తీసుకొచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే రాయలసీమ అభివృద్ధి కావాలని చంద్రబాబు తెలిపారు. రాయలసీమను అభివృద్ధి చేయాలని తాను ప్రతిజ్ఞ చేశానన్నారు. సీమ ప్రజలు వలసలు పోకుండా ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేందుకు ఏపీ ప్రభుత్వం సాయంచేస్తుందన్నారు.