ys viveka: వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై పోలీసుల ప్రెస్ నోట్
- హత్య జరిగిన స్థలంలోనే వివేకాకు దుస్తులు మార్చారు
- రక్తంలో తల వెంట్రుకలు, బొట్టు బిళ్లలు ఉన్నాయి
- అక్కడి నుంచి కొందరికి ఫోన్లు వెళ్లాయి
వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కడప జిల్లా పోలీసులు ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.
"హత్య జరిగిన స్థలంలోనే వివేకా మృతదేహానికి దుస్తులను మార్చారు. గాయాలకు కట్లు కట్టారు. దాదాపు రెండు లీటర్ల రక్తాన్ని తుడిచేశారు. గంగిరెడ్డి, కృష్ణారెడ్డి చెప్పినట్టుగా పని మనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్ రక్తాన్ని తుడిచాడు. రక్తంలో తల వెంట్రుకలు, బొట్టు బిళ్లలు ఉన్నాయి. ఘటనా స్థలంలోనే లేఖను దాచేశారు.
కొందరికి అక్కడి నుంచి ఫోన్లు వెళ్లాయి. మృతదేహాన్ని అక్కడి నుంచి వారే మార్చురీకి తరలించారు. కావాలనే సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఈ పని చేయాలని వారిని ఎవరు ఆదేశించారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నిందితులను 15 రోజులు కస్టడీకి ఇస్తే వాస్తవాలను వెలికి తీస్తాం. ఈ కేసులో ఇప్పటికే పదుల సంఖ్యలో వ్యక్తులను విచారించాం.." అంటూప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.