Andhra Pradesh: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైదరాబాద్ లో రూ.2 కోట్ల విలువైన భూమిని రూ.4 లక్షలకే కొన్నారు!: వైసీపీ నేత రవీంద్రబాబు
- ఆయన పేరుపై రూ.6.5 కోట్ల చరాస్తులు ఉన్నాయి
- మరో ఆదాయంలేని జేడీకి ఈ ఆస్తి ఎలా వచ్చింది?
- క్విడ్ ప్రోకో ద్వారానే ఈ మొత్తాన్ని అందుకున్నారు
జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రూ.2 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.4 లక్షలకే కొన్నారని వైసీపీ నేత, అమలాపురం లోక్ సభ సభ్యుడు రవీంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్ శివారు శంకరపల్లిలో ఎకరం భూమిని లక్ష్మీనారాయణ రూ.4 లక్షలకు దక్కించుకున్నారని విమర్శించారు. ఈ భూమిని అసలు ఎలా కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నిజాయతీపరుడైన అధికారిగా, పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా చెప్పుకునే లక్ష్మీనారాయణకు ఏడాదికి ఆదాయం రూ.20 లక్షలకు మించదని స్పష్టం చేశారు. అలాంటి లక్ష్మీనారాయణ రూ.6.5 కోట్ల చరాస్తులను చూపారని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముంబైలో రూ.5 కోట్ల విలువైన ఫ్లాట్ ను అమ్మినట్లు లక్ష్మీనారాయణ అఫిడవిట్ లో పేర్కొన్నారని రవీంద్రబాబు చెప్పారు. ఉద్యోగం తప్ప మరో ఆదాయమార్గం లేదని చెప్పిన లక్ష్మీనారాయణకు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. క్వీడ్ప్రోకోలో భాగంగా అందుకున్న రూ.6.5 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసిన లక్ష్మీనారాయణ హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లిలో భూమిని కొన్నారని ఆరోపించారు. జనసేన తరఫున లక్ష్మీనారాయణ విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.