Narendra Modi: పుత్రుడి ఎదుగుదల చూడాలనుకుంటున్న వారి ఆశలకు ఏప్రిల్ 11 తర్వాత అస్తమయం తప్పదు: మోదీ సెటైర్
- 'తండ్రీకొడుకులు' అంటూ మోదీ వ్యాఖ్యలు
- చంద్రబాబు, లోకేశ్ లపై పరోక్ష విమర్శలు
- కర్నూలు సభలో ప్రధాని ప్రసంగం
కర్నూలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లపై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆంగ్లభాషలో 'ఎస్ యు ఎన్ సన్' అంటే సూర్యుడు అని, 'ఎస్ ఒ ఎన్ సన్' అంటే కుమారుడు అని అర్థం అని చెప్పారు. మీరు బీజేపీకి వేసే ఓటుతో ఏప్రిల్ 11 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త సూర్యోదయాన్ని చూస్తుందని, అదే సమయంలో ఎవరైతే తన పుత్రుడి రాజకీయ ఎదుగుదలను చూడాలనుకుంటున్నారో వారి ఆశలకు, ఆకాంక్షలకు అస్తమయం అవుతుందని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ లో సూర్యోదయం కావాలనుకుంటే బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. సూర్యోదయం కావాలి అనుకుంటే పుత్రుడి యొక్క రాజకీయ భవిష్యత్తును కోరుకుంటున్న ఆ తండ్రి ఆశలు నెరవేరకూడదని స్పష్టం చేశారు.
రేపు మీరు వేయబోయే ఓటు కారణంగా డబుల్ ఇంజిన్లతో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందని మోదీ జోస్యం చెప్పారు. ఒక ఓటుతో కేంద్రంలో, మరో ఓటుతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, జోడు ఇంజిన్లతో ప్రగతి పథంలో దూసుకుపోతామని అన్నారు. అంతకుముందు, తాను రాష్ట్రానికి ఎంతో చేయాలనుకుంటున్నానని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసిరావడంలేదని మోదీ విమర్శించారు. కర్నూలులో ఐఐఐటీ, మెగా పవర్ పార్క్ ఇచ్చింది తానేనని, విశాఖలో రైల్వే జోన్ ఇచ్చింది తానే అని స్పష్టం చేశారు.
కర్నూలు వచ్చిన తొలి ప్రధానమంత్రిని కూడా తానే అని, ఏపీకి తొలి గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసిందీ తానేననీ మోదీ వెల్లడించారు. ఐఐఎం, ఐఐటీ, రాజమండ్రి, కడప విమానాశ్రయాల విస్తరణ, ఇలా ఎన్నో చేసినా రాష్ట్ర ప్రభుత్వం తమతో కలిసి పనిచేయడంలేదని విమర్శించారు. ప్రధాని అయ్యాక తొలి మంత్రివర్గ సమావేశంలోనే పోలవరానికి అనుమతులు మంజూరు చేశానని అన్నారు.