national herald: ఎన్నికలున్నాయి... కేసు వాయిదా వేయండి : సుప్రీంకు సోనియా, రాహుల్ విజ్ఞప్తి
- నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో విన్నపం
- ఏప్రిల్ 23న కేసు వాయిదా నేపథ్యంలో వినతి
- యంగ్‌ఇండియా, నేషనల్ హెరాల్డ్‌లో ప్రధాన వాటాదారులు వీరు
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న కారణంగా నేషనల్ హెరాల్డ్ కేసును కొద్దిరోజులపాటు వాయిదా వేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసు వాయిదా ఏప్రిల్ 23వ తేదీన ఉన్న నేపధ్యంలో శుక్రవారం న్యాయమూర్తులకు ఈ వినతి అందించారు. నేషనల్ హెరాల్డ్, యంగ్‌ఇండియా సంస్థల్లో సోనియా, రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ఈ సంస్థ 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రీ అసెస్‌మెంట్ చేయాలని కోరుతూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సోనియా, రాహుల్‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే పన్ను ప్రొసీడింగ్స్‌ను తిరిగి తెరిచే అధికారం ఆదాయ పన్ను శాఖకు ఉందంటూ వీరి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తూ కేసును ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది. లోక్‌సభకు ఎన్నికలు జరుగుతుండడంతో ప్రచారంతో బిజీగా ఉన్న సోనియా, రాహుల్‌లు వాయిదా కోరుతూ అపెక్స్ కోర్టును ఆశ్రయించారు.