Andhra Pradesh: కర్ణాటకలో ముస్లింల ఓట్లను తీసేశారు!: ఏపీ మంత్రి యనమల ఆరోపణలు
- స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేలా చూడటం ఈసీ బాధ్యత
- 22 రాజకీయ పార్టీల ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదు
- అమరావతిలో మీడియాతో టీడీపీ సీనియర్ నేత
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేలా చూడటం ఎన్నికల సంఘం బాధ్యత అని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అయితే ఇటీవల మూడు అంశాల్లో ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 22 పార్టీలు చేసిన ఫిర్యాదులను ఈసీ బుట్టదాఖలు చేసిందన్నారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో యనమల మాట్లాడారు.
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తే కౌంటింగ్ 6 రోజులు ఆలస్యం అవుతుందని ఈసీ కుంటిసాకులు చెబుతోందని యనమల విమర్శించారు. ఏపీలో లక్షలాది ఓట్ల తొలగింపుపై ఈసీ ఏం చర్య తీసుకుందని ప్రశ్నించారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లను తొలగించినట్లు అధికారులే చెప్పారనీ, కర్ణాటకలో ముస్లింల ఓట్లను తొలగించారని చెప్పారు. బిహార్ సహా ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో ఇదే పని చేశారన్నారు. ఇప్పుడు ఏపీలో 9 లక్షల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేశారన్నారు.
లక్షల సంఖ్యలో ఫామ్ -7(ఓట్ల తొలగింపు దరఖాస్తు) దుర్వినియోగం అవుతుంటే ఈసీ ఏం చేసిందని ప్రశ్నించారు. దాఖలైన దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవని తేలిందనీ, ఈ నేపథ్యంలో దరఖాస్తులు ఇచ్చినవారిపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ప్రధాని మోదీ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. కేంద్రం ప్రకటించే ప్రతీ పథకంలోనూ రాష్ట్రాల వాటా ఉంటుందని యనమల గుర్తుచేశారు.