Andhra Pradesh: విద్యుత్ బకాయిలు చెల్లించని వైసీపీ నేత ఆమంచి కంపెనీ.. కనెక్షన్ కట్ చేసిన ఏపీ విద్యుత్ శాఖ!
- ప్రకాశం జిల్లా వేటపాలెంలో క్రిస్టల్ సీఫుడ్స్ కంపెనీ
- రూ.1.30 కోట్ల మేర బకాయిలు చెల్లించని సంస్థ
- నోటీసులు ఇచ్చినా స్పందించని యాజమాన్యం
వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కు చెందిన కంపెనీకి విద్యుత్ సరఫరాను ఏపీ విద్యుత్ శాఖ నిలిపివేసింది. ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని పొట్టిసుబ్బయ్యపాలెంలో ఉన్న క్రిస్టల్ సీఫుడ్స్ సంస్థ విద్యుత్ కనెక్షన్ కట్ చేసింది. ఈ విషయమై విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. క్రిస్టల్ సీఫుడ్స్ సంస్థ విద్యుత్ శాఖకు రూ.1.30 కోట్ల బకాయి పడిందని తెలిపారు.
ఈ బిల్లులు చెల్లించాల్సిందిగా పలుమార్లు నోటీసులు జారీచేశామన్నారు. అయినా కంపెనీ యజమానులు, ప్రతినిధులు స్పందించకపోవడంతో నిబంధనల మేరకు విద్యుత్ కనెక్షన్ ను కట్ చేశామని పేర్కొన్నారు. ఈ విషయంలో నిబంధనల మేరకు ముందుకు పోతామని వ్యాఖ్యానించారు. కాగా, ఈ విషయమై ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు.