Congress: కార్యకర్త గాయానికి ఆయింట్ మెంట్ పూసిన ప్రియాంక గాంధీ
- అయోధ్యలో ఘటన
- సీసా గుచ్చుకుని కార్యకర్తకు గాయం
- వెంటనే స్పందించిన ప్రియాంక
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా ఓ కార్యకర్త గాయపడడంతో ప్రియాంక వెంటనే స్పందించి ప్రథమచికిత్స చేయడం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న ఈ 'గాంధీ' వారసురాలు అయోధ్యలోని నువావా కువా ప్రాంతంలో పర్యటిస్తుండగా, ప్రయాగ్ రాజ్ నుంచి విశాల్ సోంకర్ అనే కార్యకర్త ఆమెను కలిసేందుకు వచ్చాడు. ప్రియాంకను కలిసి ఆమెకు ఇందిరాగాంధీ చిత్రపటాన్ని బహూకరించాలని విశాల్ భావించాడు.
అయితే, ప్రియాంక వద్దకు వెళ్లి చిత్రపటం అందించే క్రమంలో ఓ సీసా పగిలి అతడి చేతికి గాయం అయింది. రక్తస్రావం అవుతుండడంతో వెంటనే స్పందించిన ప్రియాంక స్వయంగా ప్రథమ చికిత్స అందించి గాయానికి ఆయింట్ మెంట్ పూశారు. అనంతరం, తన కాన్వాయ్ లోని అంబులెన్స్ సిబ్బందిని పిలిపించి తదుపరి చికిత్స అందించాలని సూచించారు. కాగా, ప్రియాంక సోదరుడు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా కొన్నిరోజుల క్రితం రోడ్డుప్రమాదంలో గాయపడిన జర్నలిస్టును తన వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లడం తెలిసిందే.