Jammu And Kashmir: హెలికాప్టర్ కూలిపోతే బ్లాక్ బాక్స్ ను ఎత్తుకెళ్లిన గ్రామస్తులు!
- గతనెలలో బుద్గామ్ లో కూలిన చాపర్
- కనిపించని బ్లాక్ బాక్స్, డేటా రికార్డర్
- స్థానికులపై అనుమానాలు
గత నెలలో కశ్మీర్ లోని బుద్గామ్ లో ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోయి ఆరుగురు సిబ్బంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అదే సమయంలో పాక్ యుద్ధ విమానాలు కాశ్మీర్ గగనతంలోకి ప్రవేశించడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. అయితే, బుద్గామ్ వద్ద హెలికాప్టర్ కూలిపోయిందని తెలిసిన వెంటనే భారత వాయుసేన వర్గాలు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నాయి. కానీ వారికి అక్కడ హెలికాప్టర్ శకలాలు, సిబ్బంది మృతదేహాలు తప్ప కీలకమైన బ్లాక్ బాక్స్, డేటా రికార్డర్ లు మాత్రం కనిపించలేదు. పరిసరాల్లో ఎంత వెదికనా ప్రయోజనం లేకపోయింది.
ఓ విమానం కానీ, హెలికాప్టర్ కానీ ప్రమాదానికి గురైనప్పుడు అందుకు గల కారణాలు తెలిసేది బ్లాక్ బాక్స్, డేటా రికార్డర్ వల్లే. కానీ, ఈ ప్రమాదంలో భారత వాయుసేన అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అయితే, బ్లాక్ బాక్స్ తో పాటు ఫ్లయిట్ డేటా రికార్డర్ ను సమీప గ్రామస్తులే ఎత్తుకెళ్లి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే కొందరు స్థానికులు ఆ చాపర్ విడిభాగాలు తీసుకుపోయినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో, సమీప గ్రామాల్లో బ్లాక్ బాక్స్, డేటా రికార్డర్ కోసం సోదాలు ముమ్మరం చేశారు.