mehabooba mufti: అదే జరిగితే ఇండియాకు, జమ్ముకశ్మీర్ కు మధ్య బంధం ముగిసినట్టే: మెహబూబా ముఫ్తీ
- ఆర్టికల్ 370ని తొలగిస్తే బంధం ముగిసినట్టే
- సంబంధాలపై మళ్లీ చర్చించుకోవాల్సి ఉంటుంది
- ఇండియాతో జమ్ముకశ్మీర్ కలసి ఉండాలని మీరు అనుకుంటున్నారా?
ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తే... భారత్ తో జమ్ముకశ్మీర్ కు బంధం ముగిసినట్టేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇండియాతో జమ్ముకశ్మీర్ కు ఉన్న బ్రిడ్జ్ అయిన ఆర్టికల్ 370ని తొలగిస్తే... జమ్ముకశ్మీర్, ఇండియాకు మధ్య ఉన్న సంబంధాలపై మళ్లీ చర్చించుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. అప్పుడు మరిన్ని కొత్త కండిషన్లు వస్తాయని చెప్పారు. ముస్లిం మెజార్టీ రాష్ట్రమైన జమ్ముకశ్మీర్ భారత్ తో కలిసి ఉండాలని ఇప్పటికీ మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ) ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. జమ్ముకశ్మీర్ లో ఇతర ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయకుండా ఈ ఆర్టికల్స్ అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, వీటికి సంబంధించి మార్పులు చేయడమో లేక పూర్తిగా తొలగించడమో చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, మెహబూబా ముఫ్తీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.