Mallareddy: ఇట్లా జరిగితే సీఎం కేసీఆర్ కు కోపం రాదా?: టీఎస్ మంత్రి మల్లారెడ్డి
- ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ సభ విఫలం
- ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్
- ఇంటి పెద్ద ఆగ్రహమేనన్న మల్లారెడ్డి
శుక్రవారం నాడు హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ సభ విఫలం కావడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలపై కోప్పడ్డారని వచ్చిన వార్తపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఓ ఇంటికి పెద్ద మనిషిగా, ఇట్లా జరిగితే తన కుటుంబ సభ్యులపై ఎలా కోపాన్ని చూపుతారో, కేసీఆర్ అలానే చేశారని అన్నారు. దీనిలో తప్పేమీ లేదని, సాయంత్రం కావడం, ట్రాఫిక్ పెరిగిపోవడంతో కొన్ని వందల లారీలు స్టేడియం వరకూ చేరుకోలేకపోయాయని, అందువల్లే జనం పలుచగా కనిపించారని మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. తాము ఇదే విషయాన్ని కేసీఆర్ కు వివరించామని, ఇంకొంత ముందు జాగ్రత్తపడుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదని అన్నారు.
ఈ సభకు తానే దాదాపు 70 వేల మందిని పంపానని, వారిలో సగానికి సగం మంది కూడా స్టేడియానికి చేరుకోలేకపోయారని అన్నారు. రాష్ట్రంలోని లోక్ సభ నియోజకవర్గాల్లో 16 చోట్లా గెలుపు ఖాయమని, అయితే, తాము మరింత మెజారిటీ కోసం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ దివాలా తీస్తుందని, మల్కాజిగిరిలో ఆయన ఓటమి ఖాయమని మల్లారెడ్డి జోస్యం చెప్పారు.