Rahul Gandhi: మరోసారి చెబుతున్నా... హోదా ఇచ్చి తీరుతాం: రాహుల్ గాంధీ
- మోదీపై ఒత్తిడి తేలేకపోయిన ప్రాంతీయ పార్టీలు
- ఇండియాలోనే అగ్రగామిగా ఏపీని నిలుపుతాం
- ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్న రాహుల్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం విజయవాడలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని నాడు ప్రధాని స్థానంలో ఉన్న మన్మోహన్ సింగ్ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని అన్నారు. నరేంద్ర మోదీ ఏపీకి హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు హోదా కోసం మోదీపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం అయ్యారని, ఇది తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇండియాలోనే అగ్రగామిగా మార్చేందుకు కాంగ్రెస్ కట్టుబడివుందని చెప్పిన రాహుల్ గాంధీ, తమ మేనిఫెస్టోలో ఓ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. పేదరికాన్ని తరిమివేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని, పేదలకు కనీస ఆదాయ పథకాన్ని అందిస్తామని చెప్పారు. మహిళాభ్యుదయానికి, మహిళల ఉన్నతికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాహుల్ కోరారు.