Andhra Pradesh: విజయవాడ భరోసా యాత్రలో జగన్ పై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ!
- మోదీ పేదలపై యుద్ధం ప్రకటించారు
- మేం పేదరికంపై యుద్ధం ప్రకటించాం
- అవినీతిలో కూరుకున్న జగన్ ఏపీకి న్యాయం చేయలేరు
- విజయవాడలో కాంగ్రెస్ భరోసా యాత్రలో రాహుల్ వ్యాఖ్య
ప్రధాని మోదీ దేశంలోని నిరుపేదలపై యుద్ధం ప్రకటిస్తే తాము పేదరికంపై యుద్ధం ప్రకటించామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. కనీస ఆదాయ భధ్రత పథకం(న్యాయ్) ద్వారా అందరినీ ఆదుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సహా అన్నిరాష్ట్రాల్లోని పేదలకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈరోజు నిర్వహించిన కాంగ్రెస్ భరోసా యాత్రలో రాహుల్ ప్రసంగించారు.
ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదనీ, తనకు ఏపీలో ప్రత్యేకమైన అనుబంధం ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. జగన్ పై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయనకు అధికారం అప్పగిస్తే ఎలాంటి అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు.
ఒకవేళ అధికారం అప్పగించినా అవినీతిలో కూరుకుపోయిన జగన్ ఏపీకి న్యాయం చేరలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాను కల్పిస్తామని పునరుద్ఘాటించారు.