Andhra Pradesh: జగన్ ను చూస్తుంటే జాలి వేస్తోంది !: ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు
- చంద్రబాబు వల్లే అనంతలో కియా వచ్చింది
- మోదీ ఇందుకోసం లేఖ రాయలేదు
- మంగళగిరిలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతోనే అనంతపురం జిల్లాలో ‘కియా కార్ల పరిశ్రమ’ ఏర్పాటు అయిందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఏనాడైనా ఏపీలో పరిశ్రమను ఏర్పాటు చేయాలని కియా కంపెనీకి లేఖలు రాశారా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేశ్ ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు.
అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీలో సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ టీడీపీని గెలిపించాలని కోరారు. వైసీపీ అధినేత జగన్ ను చూస్తే తనకు జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ ఓ చేతిలో ఫ్యాన్ పట్టుకుని తిరుగుతున్నా, ఆ ఫ్యాన్ మాత్రం తిరగదని ఎద్దేవా చేశారు.
జగన్ ఫ్యాన్ స్విచ్ మోదీ వద్ద, రెగ్యులేటర్ తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ఉన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నసంగతి తెలిసిందే.